రిజర్వేషన్లను టచ్ చేయం.. చేయనివ్వం – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్లను టచ్ చేయం.. చేయనివ్వం
– కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
– అమెరికాలో రాహుల్ వ్యాఖ్యలపై ఆగ్రహం
– రాహుల్ దేశ వ్యతిరేకి అన్న హోం మంత్రి
– విదేశీ గడ్డ మీద స్వదేశంపై విషం చిమ్ముతాడని వ్యాఖ్య
– భాష, మతపరమైన చీలికలు తెస్తున్నారని విమర్శలు
ప్రజాస్వరం, నేషనల్ బ్యూరో : దేశంలో రిజర్వేషన్లను టచ్ చేయమని, ఎవ్వరిని టచ్ చేయనివ్వమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ దేశ వ్యతిరేకి అని మండిపడ్డారు. విదేశీ గడ్డ మీద స్వదేశంపై విషం చిమ్ముతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు అండగా నిలబడటం రాహుల్‌కు, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని అమిత్ షా విమర్శించారు. ‘దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు అండగా నిలవడం, దేశవ్యతిరేక ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది. అది జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన దేశ వ్యతిరేక, రిజర్వేషన్ వ్యతిరేక ఎజెండాకు మద్దతివ్వడమైనా సరే లేదా విదేశీ గడ్డపై భారత వ్యతిరేక ప్రకటనలు చేయడమైనా సరే.. రాహుల్ గాంధీ ఎప్పుడూ దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ప్రాంతీయవాదం, మతం, భాషా భేదాల తరహాలో చీలికలు తెచ్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ గాంధీ ప్రకటన బయటపెట్టింది. దేశంలో రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడటం ద్వారా.. కాంగ్రెస్‌కు, ఆయనకు రిజర్వేషన్‌పై ఉన్న వ్యతిరేకతను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. ఆయన మనసులో మెదిలే ఆలోచనలే చివరికి మాటల రూపంలో బయటపడ్డాయి. ఇక్కడ నేను రాహుల్‌కు ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నాను. బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు. అలాగే దేశభద్రతతో ఎవరూ ఆటలాడలేరు’ అంటూ మండిపడ్డారు.