కేజ్రీవాల్ విడుదల
కేజ్రీవాల్ విడుదల
– లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ మంజూరు
– 156 రోజుల పాటు జైలు జీవితం
– కేజ్రీవాల్‌కు ఘన స్వాగతం పలికిన ఆప్ శ్రేణులు
– కార్యకర్తలను చూసి సీఎం భావోద్వేగం
– తన ప్రతి రక్తపు బొట్టు దేశానికే అంకితమని వ్యాఖ్య
ప్రజాస్వరం, నేషనల్ బ్యూరో : లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఇదే కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. దాదాపు ఆరు నెలల తర్వాత కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అక్రమం కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయ ప్రక్రియలో సుదీర్ఘ కాలం ఓ వ్యక్తి జైలులో ఉండటం అతని స్వేచ్ఛను హరించడమేనని న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ పేర్కొన్నారు. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ అరెస్ట్ చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు కోర్టు రూ.10 లక్షల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో ఈ బెయిల్ మంజూరు చేసింది. కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. సీఎం కార్యాలయానికి వెళ్లొద్దని, అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది.
156 రోజుల జైలు జీవితం....
లిక్కర్ పాలసీ కేసుల మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. పది రోజుల విచారణ అనంతరం ఏప్రిల్ 1న తీహార్ జైలుకు తరలించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం మే 10న 21 రోజుల పాటు కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం జూన్ 2న మళ్లీ జైలుకు వెళ్లారు. ఈ కేసులో జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జూన్ 25న బెయిల్‌పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జూలైలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు నుంచి బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. దీంతో ఈడీ కేసులో ఊరట లభించినా ఆయన సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉండాల్సి వచ్చింది. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి 177 రోజులు జైలు జీవితం గడిపారు. ఎన్నికల సందర్భంగా బయటకు వచ్చిన 21 రోజులను పక్కన పెడితే కేజ్రీవాల్ మొత్తం 156 రోజులు జైలులో ఉన్నారు.
సీబీఐపై కోర్టు కీలక వ్యాఖ్యలు...
బెయిల్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐను ఉద్ధేశిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ విషయంలో సీబీఐ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. దేశంలో సీబీఐ పరిస్థితిని వర్ణిస్తూ పంజరంలో ఉన్న చిలుక మాదిరి వ్యవహరించకూడదని సూచించారు. సీబీఐ అంటే స్వతంత్రంగా వ్యహరించడం లేదని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థగా పని చేస్తుందనే అర్థంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీబీఐ కేంద్ర ప్రభావంతో పని చేసే పంజరంలో ఉన్న చిలుక కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ అంటే స్వేచ్ఛగా విహరించే చిలుకలా వ్యవహరించాలని తెలిపారు. తనపై వ్యక్తమైన అనుమానాలను సీబీఐ నివృత్తి చేసుకోవాలని సూచించారు.
దేశాన్ని అమ్మే వాళ్లకు వ్యతిరేకంగా పోరాడతా – అరవింద్ కేజ్రీవాల్
కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కడంతో ఆప్ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. తీహార్ జైలు వద్దకు భారీగా తరలి వచ్చి నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేసిన కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'వర్షంలోనూ నా కోసం ఎదురు చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. నన్ను జైల్లో బంధించి నా మనోస్థైర్యం దెబ్బ తీయాలనుకున్నారు. కానీ, ఇప్పుడు నా బలం, నాలో ధైర్యం వంద రేట్లు పెరిగింది' అని పేర్కొన్నారు. తాను నిజాయితీ పరుడు కాబట్టే దేవుడు తనకు మద్దతుగా నిలిచాడన్నారు. తన కోసం మసీదులు, ఆలయాలు, చర్చిల్లో ప్రార్థనలు చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తనను జైల్లో వేస్తే వేస్తే బలహీనపడతానని అనుకున్నారని, కానీ జైలు గోడలు తను బలహీనపర్చలేవని వెల్లడించారు. దేశాన్ని అమ్మే, విచ్ఛిన్నం శక్తులకు వ్యతిరేకంగా పోరాడతానని స్పష్టం చేశారు. తన ప్రతి రక్తపు బొట్టు దేశం కోసమే అంకితమని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌కు ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్, మంత్రి అతీషి, సీనియర్ నేత మనీష్ సిసోడియా, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తదితరులు స్వాగతం పలికారు.