రాష్ట్రంలో 2071 ప్రాంతాలకు పొంచి ఉన్న డెంగ్యూ ముప్పు..!
తెలంగాణ రాష్ర్టంలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. పలు ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి డెంగ్యూ ముప్పు పొంచి ఉన్నదని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని తన ఆదేశాల్లో పేర్కొన్నది.
హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తు శుక్రవారం వైద్యశాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలతో డెంగ్యూ నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 2071 ప్రాంతాల్లో డెంగ్యూ విజృంభించే అవకాశం ఉన్నదని గుర్తించి హెచ్చరికలు జారీచేసినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మొత్తం 65.62 లక్షల జనాభా నివసిస్తున్నట్టు చెప్పారు. వారంతా ముప్పు అంచున ఉన్నట్టు వెల్లడించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్‌లో కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దోమల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. టీహబ్స్‌కు అదనంగా 42 డెంగ్యూ పరీక్షా కేంద్రాలను నిర్వహిస్తున్నామని, అన్ని బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్‌లెట్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక రెస్పాన్స్ టీమ్స్‌ను నియమించినట్టు చెప్పారు.