వారం రోజుల్లో పరిహారం అందజేస్తాం – వరద బాధితులకు సీఎం చంద్రబాబు హామీ
వారం రోజుల్లో పరిహారం అందజేస్తాం
– వరద బాధితులకు సీఎం చంద్రబాబు హామీ
– ఇండ్లు దెబ్బతింటే కొత్త ఇంటి నిర్మాణం
– ధ్వంసమైన వాహనాలకు రూ.10 వేలు
– రైతులకు త్వరలో నష్ట పరిహారం
– వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం
ప్రజాస్వరం, ఏపీ బ్యూరో : వారం రోజుల్లో వరద బాధితులకు పరిహారం అందజేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. కిర్లంపూడి మండలం రాజుపాలెంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు కష్టాలు వచ్చాయని, ప్రాజెక్టుల నిర్వహణ సరిగా చేయలేదని విమర్శించారు. ఏలేరు రిజర్వాయర్‌కు ఒకే సారి 47 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని సీఎం తెలిపారు. దీంతో పలు ప్రాంతాలు నీటమునిగాయన్నారు. కలెక్టర్ సమయస్ఫూర్తితో నష్టం తగ్గిందని అభినందించారు. వరదల వల్ల కాకినాడలో 65 వేల ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన పంట పొలాలకు హెక్టారుకు రూ.25 వేల పరిహారం ఇస్తామని చెప్పారు. వరదల వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి కొత్త ఇళ్లు నిర్మిస్తామన్నారు. వరదల్లో దెబ్బతిన్న ఒక్కో వాహనానికి రూ.10 వేలు పరిహారం అందజేస్తామని చెప్పారు.
గత ప్రభుత్వం తప్పిదాలతోనే వరదలు...
గత ప్రభుత్వ తప్పిదాలతోనే విజయవాడలో వరదలు వచ్చాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీలాంటి రాజకీయ పార్టీ ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇటీవల ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులతో చంద్రబాబు మాట్లాడారు. బుడమేరుకు పడ్డ గండ్లను వైసీపీ ప్రభుత్వం పూడ్చకపోవడం వల్లే విజయవాడ ముంపునకు గురైందన్నారు. వాతావరణంలో మార్పులతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని , ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా బెజవాడను వరదలు ముంచేశాయని పేర్కొన్నారు. 50 టన్నుల బరువున్న బోట్లతో ప్రకాశం బ్యారేజీని దెబ్బ తీయాలని కుట్ర చేశారని ఆరోపించారు. నాలుగు బోట్లను కృష్ణానదిలో వదిలిపెట్టింది ఎవరని ప్రశ్నించారు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ప్రకాశం బ్యారేజీ ఉండేది కాదన్నారు. లంక ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని వెల్లడించారు. బోట్లపై వైసీపీ రంగులున్నాయని, ఆ బోట్లు వైసీపీ వాళ్లవేనని స్పష్టం చేశారు.
అధికారులకు ప్రశంసలు...
నేను బురదలో దిగాను కాబట్టే అధికారులంతా సమన్వయంతో పని చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు మెచ్చుకునేలా అధికారులు పని చేశారని ప్రశంసించారు. తన దెబ్బకు పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి బురదలో దిగే పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, రోజురోజుకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఆదాయం పడిపోయిందని, 10 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలని తెలిపారు. వచ్చే ఆదాయం వడ్డీకే సరిపోయేలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరదల కారణంగా నష్టపోయిన వారి రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తామన్నారు.
టీడీపీ హయాంలోనే 72 శాతం పనులు...
పోలవరం పూర్తయి ఉంటే రాష్ట్రం చాలా వరకు సుభిక్షంగా ఉండేదని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలోనే పోలవరంలో 72% పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. టీడీపీ అధికారం కొనసాగి ఉంటే ఈపాటికి ప్రాజెక్టు పూర్తయి జాతికి అంకితం చేసేవాళ్లం అన్నారు. పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. టెక్నాలజీలో వచ్చిన మార్పులను ఉపయోగించుకొని తుఫాన్లు, వరదల సమయంలో సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.